ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
-యువత స్వశక్తిని నమ్ముకోవాలి
=మోసగాళ్లను ఆశ్రయించ వద్దు : డీసీపీ అఖిల్ మహాజన్
మంచిర్యాల : నిరుద్యోగుల ఆశ పెట్టబడిగా చేసుకొని కొందరు ఉద్యోగాల పేరుతో నిత్యం ఏదో ఒకచోట మోసాలు చేస్తూనే ఉన్నారు. బాధితులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ మోసం చేస్తున్న ముఠాను హాజీపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు…
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కర్ణమామిడిలో నివాసం ఉంటున్న బొడ్డు రజితకు దొనబండ గ్రామానికి చెందిన గుడెల్లి తిరుపతి, అతని స్నేహితుడు నామిని సతీష్ కలిసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆశ చూపారు. కస్తూర్బా స్కూల్లో కిచెన్ గార్డెన్ ఇంచార్జ్ (తోటమాలి) ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ప్రతి నెల 12 వేల రూపాయల జీతం వస్తుందని నమ్మబలికారు. హైదరాబాద్‌లో సుజాత ఠాకూర్ అనే మహిళ నడిపిస్తున్న సుచిత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆ ఉద్యోగానికి రూ. 1,70,000 అవుతుంది అని, ఒకవేళ ఉద్యోగం రానట్లయితే నీ డబ్బులు నీకు రిటర్న్ ఇప్పిస్తామని చెప్పారు. దీంతో రజిత వాళ్లకు 28/12/2018 తేదీన 80,000 రూపాయలు ఇచ్చింది. తిరుపతి సతీషు ఇద్దరు వచ్చి జాబ్ వచ్చినట్టు నకిలీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఆమెను లక్షేట్ పేట కస్తూర్బా స్కూల్ కి తీసుకొని వెళ్లి జాయిన్ చేసినట్లుగా నటించి ఇంటికి వచ్చి మిగతా 90,000 రూపాయలు తీసుకువెళ్లారు. రెండు నెలల తర్వాత ఆమెకు జీతం రాకపోవడంతో వారిద్దరిని జీతం కోసం నిలదీసింది. దీంతో డబ్బులు వావస్ ఇస్తామని చెప్పి తర్వాత దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించారు.
మరో కేసులో దొనబండకు చెందిన బైరి రవి కుమార్ అనే వ్యక్తిని సైతం ఇదే విధంగా మోసం చేశారు. గుడెల్లి తిరుపతి, నామిని సతీష్ కస్తూర్బా స్కూల్ లో సూపర్వైజర్ ఉద్యోగం ఇస్తామని 3 లక్షలు వసూలు చేశారు. 18 నెలలైనా జీతం రాకపోవడంతో అతను కూడా నిలదీశాడు. తన మూడు లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుపతి, సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాదులో సుజాత ఠాకూర్ ని లను విచారించి కోర్టు ముందు హాజరు పరిచారు.
ఈ సందర్భంగా మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ చాలా మంది యువత త్వరగా ఉద్యోగం సంపాదించాలని, తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఆసరగా నిలువాలని మరి కొందరు మోసగాళ్ల బారిన పడుతున్నారని అన్నారు. ఏ ఉద్యోగమైనా సరే తాము చదివిన చదువుల్లో ప్రతిభ, ఇంటర్వూ ఆధారంగా వస్తుందనే విషయం మరిచిపోతున్నారని అన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం రాదన్నారు. ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మిమోసపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.