బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి..

జగిత్యాల సభ వేదికపైనే ప్రకటించిన కేసీఆర్

Jeevan Reddy:బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జీవ‌న్‌రెడ్డిని నియమిస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామ‌ని కేసీఆర్ అదే స‌భా వేదిక‌పై నుంచి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కూడా జీవన్ రెడ్డి అనేక పదవులు, సేవలు అందిస్తారని తెలిపారు.

45 ఏండ్ల నుంచి మేం స్నేహితులమ‌ని, భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశామని తెలిపారు. జీవన్ రెడ్డి నిబద్ధత, ప్రజా జీవితంలో పనిచేసిన పద్ధతి ఎందరికో ఆదర్శమన్నారు. ఆయన ఒక్క జగిత్యాలలోనే కాదు.. పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, పొరుగున ఉన్న అనేక జిల్లాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. జగిత్యాల అభివృద్ధిని ఏ మాత్రం విస్మరించలేదని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరితే ఎలా ఉంటుందని పలువురు సర్వేలు చేసి చెప్పారని కేసీఆర్ తెలిపారు. జగిత్యాలతో పాటు చొప్పదండి, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి, ఇలా చాలా నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని ఆ సర్వేల్లో తేలిందని పేర్కొన్నారు. అది జీవన్ రెడ్డి విశిష్టత అని వివరించారు.

జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక సమితి ప్రెసిడెంట్‌గా ప్రారంభించి, ప్రజా సమస్యలపై పోరాడారని తెలిపారు. నిఖార్సైన ప్రజా కార్యకర్తగా నిరూపించుకుని అంచెలంచెలుగా ఎదిగి, అనేక పదవులు చూశారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి పదవులు కొత్త కాదు.. ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి పదవి అలంకరించడం అనేక రంగాల్లో పనిచేశారని గుర్తుచేశారు. జీవన్ రెడ్డిని మొన్న కలిసినప్పుడు.. కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని చెప్పానని తెలిపారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like