పోలీసు ఉద్యోగాల పరీక్ష తేదీలు ఖరారు…
తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పరీక్షా తేదీలు ఖరారు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్సై ఉద్యోగాలకు 2.47 లక్షలు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో.. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్ జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేసిన తరువాత పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజగా దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్షల నిర్వహణ వైపు అధికారులు దృష్టి సారించారు. పోలీస్,ఎక్సైజ్,జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
తాజాగా యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసినందున ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు దృష్టి సారించారు. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ పోస్టుల్లో బ్యాక్లాగ్ తావులేకుండా ముందుగా ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. జైళ్లు, అగ్నిమాపకశాఖల్లోని పోస్టుల భర్తీకి తేదీల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఈసారి ఎక్సైజ్, రవాణాశాఖల పోస్టుల భర్తీ టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహిస్తోంది. ఈసారి యూనిఫాం పోస్టులకు అభ్యర్థులు మంచి ఆసక్తి చూపించారు. అన్నిశాఖల్లో 17,516 పోస్టులకు 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు సగటున 72 దరఖాస్తులు వచ్చినట్టయ్యింది. మొత్తం 7.20 లక్షల మంది అభ్యర్థులు ఈ దరఖాస్తులను సమర్పించారు.
వివిధ విభాగాలకు విడివిడిగా దరఖాస్తులు స్వీకరించడంతో పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెప్తున్నారు.