మంత్రికి మరక..
-తలనొప్పిగా మారిన పోస్టుల భర్తీ ప్రక్రియ
-తిరిగి తిరిగి మంత్రికి చుట్టుకునే అవకాశం
-వివరాలు తెప్పించుకున్న అధిష్టానం
-నష్ట నివారణ చర్యలు ఫలితమిచ్చేనా..?
నిర్మల్ : మున్సిపాలిటీలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియకు సంబంధించి పార్టీ నేతలు చేసిన తప్పులు ఇప్పుడు మంత్రి తలకు చుట్టుకుంటున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారు మంత్రి.. అవి సత్ఫలితాలు ఇస్తాయా..? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ విషయంలో అధిష్టానం దృష్టి సారించింది.
నిర్మల్ మున్సిపాలిటీలో 44 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్ల పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నియామక ప్రక్రియ ప్రారంభం కాగానే కొందరు నేతలు ఆ పోస్టులను తమ బంధువులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంట్లో భాగంగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఉన్న వారిలో 20 మంది వరకు నేతల బంధువులు, పైరవీ చేసిన వారికి ఇచ్చేశారు. అయితే మీడియా రంగ ప్రవేశంతో అంతా తారు మారైంది. పత్రికలు, ఛానళ్ల ద్వారా విషయం బయటకు పొక్కడంతో రచ్చరచ్చ అయ్యింది. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆందోళనకు కార్యాచరణ ప్రకటించింది.
కలెక్టరేట్ ఎదుట మౌనదీక్ష చేస్తామని కాంగ్రెస్ నేతల ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి ప్రకటించడంతో ఆ వేడి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి, ఆయన దీక్షకు మద్దతుగా వచ్చిన శాసన మండలి కాంగ్రెస్ పక్ష నేత జీవన్‌రెడ్డి నేరుగా మంత్రిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పోస్టుల భర్తీలో అవినీతి వ్యవహారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఈ వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని దుయ్యబట్టారు. ఇప్పుడే తెలిసినట్టుగా నియామక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించిడం పట్ల వారు ఎద్దేవా చేశారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీని వెనక ఇంద్రకరణ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అంతకు ముందు బీజేపీ సైతం దీనిపై ఆందోళనలు నిర్వహించింది.
అటు రాజకీయంగా ఒత్తిడి వస్తుండటమే కాకుండా నిరుద్యోగులు, ప్రజల నుంచి సైతం అవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మంత్రికి తెలియకుండా జరగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందులోనూ సగం మంది వరకు టీఆర్ఎస్ కార్యకర్తల బంధువులు, వారి సంబంధీకులే ఉండటం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. మరోవైపు ఇంత జరుగుతున్నా కలెక్టర్ కానీ, మంత్రి కానీ స్పందించకపోవడం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వరుస కథనాలు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకపోవడం, చివరకు ఏలేటీ దీక్ష చేస్తున్న రోజే కలెక్టర్, మంత్రి స్పందించడం వల్ల ఉన్న పరువు పోయిందని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
ఇక మరోవైపు అధిష్టానం సైతం దీనిపైన ఆరా తీస్తోంది. ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్న పెద్దలు ఏం జరిగింది…? దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపై వివరాలు సేకరిస్తోంది. మున్సిపల్ చైర్మన్ వ్యవహార శైలిపైన కొందరు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మంత్రి దీనిని అప్పుడే సీరియస్‌గా తీసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని పలువురు చెబుతున్నారు. అప్పుడే నష్ట నివారణ చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదని చర్చ సాగుతోంది. అప్పుడు స్పందించకపోడం, మీడియా వరుస కథనాలు, ప్రతిపక్షాల పోరాటాలు, నిరసనలతో దీనిపై వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో వెనక్కి తగ్గడం పార్టీకి కానీ, మంత్రికి కానీ మంచి పేరు ఏం తెచ్చిపెట్టలేదు. ఓ రకంగా తప్పు జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నట్లయ్యిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ విషయంలో తాత్సారం చేయకుండా వెంటనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ రద్దు చేయించి, నూతనంగా ఈ భర్తీ ప్రారంభించాలని పలువురు కోరుకుంటున్నారు. అదే సమయంలో దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప మంత్రికి పడ్డ మరక తొలగిపోయే అవకాశం లేదు. మంత్రి కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో నివేదిక రాగానే పూర్తి స్థాయిలో రద్దు చేసి తిరిగి మళ్లీ నూతనంగా భర్తీ ప్రక్రియ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే డబ్బులు వసూలు చేసిన నేతల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.