అనాథ పిల్లలకు రూ.10 లక్షల సాయం..

పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులు,సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఈ పథకం కింద ఆర్థిక చేయూత ఇవ్వనున్నారు.

కరోనా మహమ్మారి ఎన్నో జీవితాల‌ను విచ్ఛిన్నం చేసింది. ఎవ‌రికీ ఎవ‌రూ కాకుండా పోయారు. తల్లిదండ్రులకు పిల్లలను దూరం చేసింది. పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసింది. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లైన పిల్ల‌ల‌కు కేంద్రం సాయం చేస్తోంది. వారిని అదుకుంటామని గత ఏడాది ప్రకటించిన మోదీ.. తాజాగా ఆ పథకాన్ని ప్రారంభించారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకం కింద అనాథ పిల్లలకు ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తున్నారు. ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్ పథకాన్ని సోమ‌వారం ప్రారంభించారు.

ఈ ప‌థ‌కం కింద కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారికోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని తెస్తున్నాం. 18-23 ఏళ్ల వయసుండి ఉన్నత విద్య చదివే వారికి ప్రతి నెలా స్టైపండ్ ఇస్తారు. 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలను అందిస్తాం. అంతేకాదు ఆయుష్మాన్ హెల్త్ కార్డులతో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందుతుందని మోదీ చెప్పారు.

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో.. తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని అర్హులు. వారికి ఈ పథకం కింద స్కాలర్‌షిప్పులు, పీఎం కేర్స్‌ పాస్‌ పుస్తకాలు, ఆయుష్మాన్‌ భారత్‌ వైద్యబీమా కార్డు అందిస్తున్నారు. 18 ఏళ్లు నిండేసరికి వారి పేరిట రూ. 10 లక్షల సొమ్ము ఉండేలా డిపాజిట్‌ చేస్తారు. అనంతరం ఆ డబ్బుతో వచ్చిన వడ్డీని ఆర్థిక సాయంగా అందిస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి డబ్బును వారి చేతికి అందిస్తున్నారు. అంతేకాదు ఉన్నత విద్య కోసం రుణం ఇస్తారు. ఆ లోన్‌కు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది.

ఈ పథకానికి అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ‘పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ పేరుతో పోర్టల్‌‌ను ఇప్పటికే ప్రారంభించారు. పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల ఆమోద ప్రక్రియ, సాయం అందించడం వరకు అన్నీ ఈ పోర్టల్‌ నుంచే సాగుతాయి. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ లబ్ధిదారులను గుర్తించారు. వారికి ఇవాళ్టి నుంచే పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like