బొగ్గుబాయి బంద్ బెట్టి.. ఒక్క‌టై జ‌ట్టుక‌ట్టి..

-తెలంగాణ ఉద్య‌మంలో దివిటీలై ముందుకు ఉరికిన సింగ‌రేణి కార్మికులు
-ప్ర‌జ‌లు, మిగ‌తా కార్మిక వ‌ర్గానికి దిక్చూచిలు వారు
-ఢిల్లీ పెద్ద‌ల‌ను అట్టుడికించిన బొగ్గుబాయి స‌మ్మె
-తెలంగాణ ఉద్య‌మ యాదిలో

ఒక్క‌ పిలుపు వ‌స్తే చాలు సై అంటూ ముందుకు ఉరికారు… త‌మ కుటుంబం ఎలా గ‌డుస్తుంద‌నే బాధ లేదు.. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏమ‌తుంద‌నో భ‌యం లేదు.. కేవ‌లం ఒకటే ఆశ‌.. ఒక‌టే ధ్యాస తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌. ఉద్యోగాలు ఎత్తుకుపోతున్న సీమాంధ్ర పాల‌కుల మీద ఆగ్ర‌హం.. త‌మ త‌రువాతి త‌రానికైనా న్యాయం జ‌ర‌గాల‌నే త‌ప‌న‌… ఇవ‌న్నీ క‌లిసి సింగ‌రేణి కార్మికులు క‌ద‌న‌రంగంలోకి దూకేలా చేశాయి. యావ‌త్ తెలంగాణ‌కు సింగ‌రేణి దిక్సూచిగా నిలిచింది.

తెలంగాణ ఉద్య‌మంలో ముందుండి తెగించి కొట్లాడింది సింగ‌రేణి కార్మికులు… స‌బ్బండ వ‌ర్ణాల‌కు కాగ‌డాలై నిలిచి వెలుగు చూపిన దివిటీలు వారు.. తెలంగాణ ప్రజలకు, మిగ‌తా కార్మిక వర్గానికి పోరాట స్ఫూర్తినిచ్చారు. తొమ్మిది స‌మ్మెలు… 45 రోజుల పాటు సాగిన ఉద్య‌మం.. సింగ‌రేణి కార్మికుల పోరాటం యావ‌త్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌చేసింది. ఒక్క పిలుపు వ‌స్తే చాలు 60వేల మంది కార్మికులు విధులను బహిష్కరించే వాళ్లు. ఒక్క బొగ్గు పెల్ల బయటకు వచ్చేదికాదు. ఒక‌ సమ్మె…ఒక రాస్తారోకో.. ఒక వంటావార్పు ఇలా ఉద్య‌మంలో కార్మికలోకం అన్ని తామై చేసింది. ప్రతి పోరాటంలో కార్మికులంతా రోడ్డుపైకి వచ్చి ప్రత్యక్ష పోరాటాలు చేశారు. సింగరేణిలో 2009 న‌వంబ‌ర్ 30న జ‌రిగింది. ఆ రోజు నిజంగా తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మలుపు తిప్పింది. ఉద్యమ నేత చంద్రశేఖర్రావు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తుంటే అల్గునూరు వద్ద అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయ‌న‌ను ఖమ్మం జిల్లాకు తరలించి జైలు పాలు చేశారు. అక్రమ అరెస్టు కార్మికవర్గం నిరసన వ్యక్తం చేస్తూ సింగరేణిలో కార్మికులు విధులు బహిష్కరించి తొలి పోరాటం ప్రారంభించారు.

ఆ తరువాత రెండో సారి ఉస్మానియాలో ఆంధ్ర వలసవాద ప్రభుత్వం విద్యార్థులపై పైశాచికంగా లాఠీచార్జీ చేయించారు. ఈ పోలీసులు లాఠీచార్జీలో వందలాది మంది విద్యార్ధిని విద్యార్థులు తీవ్రగాయాల పాల‌య్యారు. ఆ సంఘటనకు చలించిన కార్మిక వర్గం కనెర్రజేసింది. తమ బిడ్డలపై ఆంధ్రా వలసవాదుల పైశాచిక దాడులను ఇకపై సహించమని ప్రభుత్వానికి తెలియజేస్తూ 2009, డిసెంబర్ 7న సింగరేణి వ్యాప్తంగా 60వేల మంది కార్మికులు సమ్మె చేశారు. 2009, డిసెంబర్లో వీరోచిత పోరాటం జరిగింది. దరిమిలా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ సోనియా విద్యార్థుల బలిదానాలు, మూడున్నర కోట్ల మంది ప్రజల మనోభావాన్ని గమనించి డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిస్తున్నట్టు ప్రకటించింది. త‌ర్వాత డిసెంబర్ 23న ఆ ప్రకటన వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటనపై కార్మిక లోకం భ‌గ్గుమంది. డిసెంబర్ 24, 25 రెండు రోజులు టోకెన్ సమ్మె చేసి కార్మికుల ఐక్యతను పోరాట ప‌టిమ‌ మరోసారి చాటుకున్నారు. తెలంగాణ విష‌యంలో శ్రీకృష్ణ కమిటీ నియమిస్తూ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన తెలంగాణ ప్ర‌జ‌లు కమిటీ లేదు.. ఏది లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని 2010 మార్చి 4వ తేదీన టోకెన్ సమ్మెను కార్మికులు విజయవంతం చేశారు. ఆ తరువాత తెలంగాణ ప్రాంతంలో రాజకీయ కూటమి ఏర్పడింది. పొలిటికల్ జేఏసీ ఉద్యమంలో భాగంగా ఇచ్చిన రెండు రోజుల బంద్ కు సంపూర్ణ మద్దతుగా 2010 జూన్, 24, 25వ తేదీల్లో సమ్మె చేశారు. 2011 మార్చి 4, 5వ తేదీల్లో తెలంగాణలో కొనసాగుతున్న ఆత్మబలిదానాలు ఆపి తల్లుల కొడుపుకోత నివారించాలని వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని రాజకీయ పార్టీల ఐక్యవేదిక మరోసారి రెండు రోజులు టోకెన్ సమ్మె చేయాలన్న పిలుపుకు కార్మికులు 48 గంటల సమ్మె చేసి మరోసారి తెలంగాణ సాధనపై ఉన్న మమకారాన్ని ప్రకటించారు.

తరువాత జరిగే భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తూ అనేక నిరసనలు, బంద్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడున్న 10 జిల్లాల్లో సకల జనుల సమ్మె కోసం జేఏసీ సమాయత్తమవుతూ వ్యూహరచనలు చేసింది. అందుకోసం సాహసోపేతమైన సకల జనుల సమ్మె కోసం పిలుపునివ్వాలనే సంకల్పాన్ని జేఏసీ ప్రకటించింది. అలుపెరుగని కార్మికులు 2011 సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సకల జనుల సమ్మెకు రాజకీయ పార్టీల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. సకల జనుల సమ్మె పిలుపు సింగరేణి కార్మికుల నుండి అమోఘమైన స్పందన వచ్చింది. 45 గనులు, వివిధ శాఖల‌తో పాటు దాదాపు 60వేల మంది సింగరేణి కార్మికులు సమ్మె పిలుపునకు స్పందించారు.

సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం నుంచి బొగ్గు బాయిలన్ని బంద్ లో పాల్గొన్నాయి. తెలంగాణ సాధన కోసం జరిగిన సింగరేణి కార్మికుల సమ్మె ఈ ప్రాంతంలోని అన్ని రకాల కార్మికులను ఐక్యం చేసింది. సింగరేణి కార్మికుల ఏకైక డిమాండ్ తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ చేసిన సమ్మె ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థ లలోని కార్మిక వ‌ర్గానికి స్ఫూర్తినిచ్చింది. సింగరేణి కార్మికులు చేస్తున్న సకల జనుల సమ్మెకు మద్దతు ప్రకటించని సంఘమే లేదు. చిన్న చిన్న సంఘాల నుండి ఆర్టీసీ, ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు లెక్కలేనన్ని సంఘాలు ప్రత్యక్ష పరోక్షంగా మద్దతు ప్రకటించాయి.

కార్మికుల సమ్మె ప్రభావం కేవలం రాష్ట్రానికో.. దక్షిణాది రాష్ట్రాలకో కాకుండా ఢిల్లీ పెద్దలను ప్రభావితం చేసింది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర పెద్దలు స్పష్టమైన ప్రకటనతో సమ్మె విరమణకు పరిస్థితులు అనుకూలించాయి. ఫలితంగా అక్టోబర్ 17వ తేదీన కార్మికులు సమ్మె విరమించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రీకృష్ణ కమిటి మరో ఏడాదికి రాయల తెలంగాణ అని కొత్త ప్రతిపాదనను తెచ్చింది. కార్మికుల్లో మళ్లీ అసంతృప్తి జ్వాలలు రేగాయి. 2013 డిసెంబర్ 2వ తేదీన రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మరో సమ్మె జరిగింది. హైదరాబాద్ నగరం రాజధానిగా 10 జిల్లాల తెలంగాణే కావాలని బొగ్గు గనుల కార్మికులు గొంతెత్తి నినదించారు. సింగరేణి కార్మికులు అనేక సమ్మెలను తిప్పి కొట్టడానికి సీమాంధ్రవాదులు ఎన్ని కుట్రలు పన్నినా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని తప్పుడు నివేదికలు ఇచ్చినా వాటన్నింటిని ఎప్పటికప్పుడు నిలదీస్తూ కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యమని – రెండో కోరిక లేదని స్పష్టం చేసింది.

ఇలా తెలంగాణ ఉద్య‌మంలో సింగ‌రేణి కార్మికుల పాత్ర మ‌రువ‌లేనిది… మ‌రుపురానిది…

Get real time updates directly on you device, subscribe now.

You might also like