ఈ ప్రభుత్వానికి భూమి మీద ఉండే అర్హత లేదు..
ఆదిలాబాద్ : ప్రకృతిని, భూమిని ఆరాధించే వాళ్లు గిరిజనులని, భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసేది టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే ధనసరి సీతక్క దుయ్యబట్టారు. భూములను చెరబడుతున్న ప్రభుత్వానికి అసలు భూమి మీద ఉండే అర్హత లేదన్నారు. ఆదిలాబాద్ జైలులో కోయపోశగూడ బాధితులను పరామర్శించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలు బతకడానికి అవకాశం లేదు… ప్రశ్నించడానికి హక్కు లేదన్నట్లుగా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రవరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
2002 నుంచి పోడు చేసుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రేంజర్ రత్నాకర్ రావు ఆ గిరిజనుల పట్ల అమానుషంగా ప్రవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. తాను బాధితులతో మాట్లాడానని సునీత అనే అమ్మాయిని కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రేంజర్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాలిచ్చే తల్లులను సైతం అరెస్టు చేశారని, పిల్లలు ఉన్న తల్లులుగా వారి బాధ చూడలేకపోయాలని అన్నారు.
అమాయకపు ఆదివాసీలపైనా మీ ప్రతాపం.. ఏలేటీ మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో ఆటవిక పాలనసాగుతోందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన తల్లులను అరెస్టు చేయడం దారుణమన్నారు. చిన్నచిన్న పిల్లలున్నా తల్లులను అరెస్టు చేశారని తెలిపారు. అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలో గిరిజనులపై కక్ష సాధింపు చేయడం సరికాదన్నారు. పేదోళ్ల నుండి భూములను గుంజుకుంటున్నారని అన్నారు. పొట్టకూటి కోసం సాగుచేస్తున్న ఆదివాసీలను అరెస్టు చేస్తున్నారని, అసలు స్మగ్లర్లను వదిలివేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యాచారం చేసిన వాళ్ల పైన ప్రతాపం చూపండి అమాయకపు ఆదివాసీలపై కాదంటూ ఆయన మండిపడ్డారు.