చైర్మన్ వర్సెస్ బీఎంఎస్
-సింగరేణి సీఅండ్ఎండీ మీద బీఎంఎస్ నేత కేసు
-ఆయనను మణుగూరు బదిలీ చేసిన యాజమాన్యం
-తనను బదిలీ చేస్తే ఆందోళన చేస్తామన్న యూనియన్
-కొనసాగుతున్న కోల్డ్‌వార్
మంచిర్యాల : సింగరేణిలో సీఅండ్ఎండీ, బీఎంఎస్ యూనియన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. చైర్మన్ మీద ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య కోర్టులో కేసు వేయడం, దీంతో వెంటనే యాజమాన్యం ఆయనను బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూనియన్ అతని బదిలీ ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
సింగరేణిలో సీఅండ్ఎండీగా శ్రీధర్ ఎనిమిది ఏండ్లుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఇది నిబంధనలకు విరుద్ధం. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయననే సింగరేణి సీఅండ్ఎండీగా కొనసాగిస్తోంది. దానిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని, దానికి అండగా ఉండటం కోసమే శ్రీధర్‌ను ఇక్కడ సీఅండ్ఎండీగా కొనసాగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. లేకపోతే ఆయనపై అంత ప్రత్యేకమైన అభిమానం ఏమిటని..? ఆయనకంటే అద్భుతంగా పనిచేసే అధికారులు లేరా..? అని ప్రశ్నిస్తున్నారు.. సింగరేణికి సంబంధించి డీఎంఎఫ్‌టీ,సీఎస్‌ఆర్ నిధులను ప్రభుత్వ ప్రాజెక్టులకు విరాళాలు, పథకాల పేరుతో వేల కోట్లను సీఎండీ అక్రమంగా మళ్లిస్తున్నారని సింగరేణిలో యూనియన్లు సైతం ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సింగరేణిలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఇదే విషయంలో చాలా సందర్బాల్లో ఆరోపణలు గుప్పించింది. సీఅండ్ఎండీని బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. ఆయనను బదిలీ చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపింది. అన్న విధంగానే సీఅండ్ఎండీపై కోర్టులో కేసు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సింగరేణి సంస్థలో కొనసాగుతున్నారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని తెలిపింది. దీంతో అటు యాజమాన్యం కూడా ప్రతీకార చర్యలకు దిగింది. ఆయన కోర్టులో కేసు వేయడంతో వెంటనే ఆయనను మణుగూరు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీఎంఎస్ నేతలు వ్యూహాత్మకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. స్థానికంగా బలంగా ఉన్న నేతతో పిటిషన్ వేస్తే ఇబ్బందులు ఉండకుండా ఉంటుందని యాదగిరి సత్తయ్య ద్వారా పిటిషన్ వేశారు. గతంలో సంపత్ అనే ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించారు. అతను అధికారుల అవినీతి, ఇతర అంశాలపై పిటిషన్ వేశారు. అయితే అతన్ని తొలగించినందుకే తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని యాజమాన్యం వాదించడంతో ఆ కేసు వీగిపోయింది. ఈసారి అలా కాకుండా ఉండాలనే ఆలోచనతో BMS చాలా ఆలోచించిన తర్వాత పిటిషన్ దాఖలు చేసింది. సీఅండ్ఎండీకి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తే అతన్ని బదిలీ ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని BMS తిరిగి కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సైతం కోర్టు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని అది తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది.
మరి ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై మిగతా కార్మిక సంఘాలు సైతం ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే సీఅండ్ఎండీ విషయంలో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయనపై బీఎంఎస్ కేసు పెట్టింది కాబట్టి కార్మికుల్లో యూనియన్ పట్ల సానుభూతి పెరుగుతుంది. మరి తాము ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మిగతా యూనియన్లు బీఎంఎస్‌కు మద్దతుగా నిలుస్తాయా..? లేక సొంత దారిలోనే ఆయనపై పోరాటం చేస్తాయా…? మౌనమే శరణ్యంగా ముందుకు సాగుతాయా…? అన్నది వేచి చూడాల్సిందే.