బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌పై దాడి..
-కాలింగ్ బెల్ విసిరిన చైర్‌పర్సన్
-పక్క నుంచి వెళ్లడంతో తప్పిన ప్రమాదం
-కండ్లకు నీళ్లు తెచ్చుకుని వెళ్లిపోయిన కమిషనర్ రజిత
-దాడి విషయంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన కమిషనర్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజితపై చైర్‌పర్సన్ దాడికి యత్నించారు. ఇంటి నంబర్లకు సంబంధించిన విషయంలో జరిగిన వాగ్వాదంలో కాలింగ్ బెల్ విసిరేశారు. దీంతో అక్కడి నుంచి ఏడ్చుకుంటూ కమిషనర్ రజిత వెళ్లిపోయారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత బదిలీ అయ్యారు. ఇంటి నంబర్లకు సంబంధించి కొన్ని పెండింగ్లో ఉండటంతో పలువురు కౌన్సిలర్లు కమిషనర్ దగ్గరకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటి నంబర్లు కేటాయించవద్దని చైర్‌పర్సన్ కోరారు. తనకు కౌన్సిలర్లకు మధ్య కావాలనే దూరం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఛాంబర్ లో జరిగిన ఈ గొడవలో మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత పైకి కాలింగ్ బెల్ విసిరేశారు. అది కింద పడటంతో ప్రమాదం తప్పింది. దీంతో షాక్‌కు గురైన కమిషనర్ జంపాల రజిత కండ్లకు నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్ భారతి హోళకేరీ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం.