దళితులు ఆర్థికంగా ఎదగాలి..
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకువచ్చారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం కన్నెపల్లి మండలం చెర్లపల్లిలో దళితబంధు పథకంపైన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళితులు తమ కాళ్లపైనిలబడేందుకు ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు. అందుకే ఈ పథకం కింద దళితులకు ముఖ్యమంత్రి ఉచితంగా పది లక్షలు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పథకం దేశంలోనే కాకుండా, ప్రపంచలో ఎక్కడా లేదన్నారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేవలం వాహనాలపైనే ఆసక్తి చూపెట్టకుండా రైస్ మిల్లులు, సెంట్రింగ్, హార్డ్ వేర్, మెడికల్ దుకాణాలు వంటి యూనిట్లు స్థాపించి లాభాలు పొంది ఆర్థికంగా బలపడాలని సూచించారు.