పెట్రోల్ బాంబులు… కర్రలు… రాడ్లు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనలో ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్లు ఉపయోగించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న దానికి బలం చేకూరుతోంది.
అప్పటి వరకు వచ్చిపోయే ప్రయాణికులతో సికింద్రాబాద రైల్వేస్టేషన్ ఎంతో సందడిగా ఉంది. సడెన్‌గా కొందరు ఆందోళనకారులు నినాదాలు చేస్తూ లోపలికి దూసుకువచ్చారు. అప్పటికే కొందరు లోపల ఉండి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడి ప్రయాణీకులకు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. కొందరు ఆందోళనకారులు పెట్రోల్ బాంబులను విసిరారు. బోగీల్లో ప్రయాణికులు ఉన్న సమయంలోనే పెట్రోల్ బాంబులు, రాళ్లను విసరడంతో.. వారంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. తమ వెంట తెచ్చుకున్న సామాను, వస్తువులను అక్కడే వదిలిపెట్టి పారిపోయారు.
చాలా మంది ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. ఆందోళనకారుల్లో చాలా మంది విద్యార్థుల్లా కనిపించలేదని స్పష్టం చేశారు. కర్రలు, ఐరన్ రాడ్లతో దాడులు చేశారని వారు విద్యార్థులు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆందోళనకారులు రైల్వే స్టేషన్లో ఉన్న షాపులను లూటీ చేశారు.పెద్ద మొత్తంలో డబ్బులు ఎత్తుకెళ్లారని షాపుల యజమానులు చెప్పారు. తమపై కర్రలతో దాడి చేసినట్లు వారు వెల్లడించారు. అది అల్లరి మూకల పనిగా అనిపిస్తోందని.. పక్కా ప్లాన్‌తోనే ఇంతటి విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆందోళనకారుల్లో చాలా మంది ఐరన్ రాడ్లతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. పోలీసులపైకి పెద్ద పెద్ద రాళ్లను విసిరారు.
రైల్వే స్టేషన్లో ఉన్న కొందరు విద్యార్థులు కూడా.. ఈ హింసాత్మక ఘటనల వెనక ఉన్న కోట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగానే నిరసన తెలపడానికి వచ్చామని.. కానీ తమ నిరసన కార్యక్రమం గురించి కొందరు వ్యక్తులకు ముందే తెలిసి.. విద్యార్థుల ముసుగులో విధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. బయటి వ్యక్తులే.. రైల్వే స్టేషన్లో దాడులకు పాల్పడినట్లు వారు ఆరోపించారు.