బాసరలో నిర్బంధకాండ
-మీడియాపై పోలీసుల ఆంక్షలు
-పోలీసులతో జర్నలిస్టుల వాగ్వాదం

నిర్మల్ :బాసరలో పోలీసుల రాజ్యం కొనసాగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఐదు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. తాము సమస్యలు తీర్చాలని ఎవరిని కలిసినా, ఎంత మందికి విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాసరలో విద్యార్థులు తమ ఆందోళన సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ బాసర వచ్చీ ట్రిపుల్ ఐటీని సందర్శిస్తే గానీ ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఎవరు వచ్చినా, ఎన్ని చెప్పినా వినేది లేదని స్పష్టం చేశారు. శనివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బాసర ఐఐఐటీకి వచ్చారు. విద్యార్ధులతో సంప్రదింపులు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మరోవైపు పోలీసులు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి బందోబస్తు చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతు చెప్పేందుకు బీజేపీ,కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు వస్తుండటంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో తమ ప్రతాపం అంతా మీడియా ప్రతినిధులపై చూపిస్తున్నారు. బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పర్యటనలో ట్రిపుల్ ఐటీ లోపలికి కార్యకర్తలను లోపలికి పంపిన పోలీసులు మీడియాను మాత్రం అనుమతించలేదు. దీంతో పోలీసులు,మీడియా ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.