విద్యార్థి ఉద్యమం.. విజ‌యం…

-బాసర త్రిపుల్ ఐటి విద్యార్థుల్లో మంత్రి సబిత చ‌ర్చ‌లు స‌ఫ‌లం
-సిల్లీ డిమాండ్ల‌ని చెప్పిన మంత్రే స్వ‌యంగా దిగివ‌చ్చిన వైనం
-మ‌ళ్లీ వ‌స్తా... మీతో భోజ‌నం చేస్తా :మంత్రి స‌బిత‌
-నేటి నుంచి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకానున్న విద్యార్థులు

బాస‌ర : ఎండా లేదు.. వానా లేదు. ప‌గ‌లు లేదు.. రాత్రి లేదు.. త‌మ స‌మ‌స్య‌లు తీరే వ‌ర‌కు క‌దిలేది లేద‌నే ప‌ట్టుద‌ల‌.. ఎన్నిమార్లు ప్ర‌భుత్వాలు, అధికారుల‌కు విన్న‌వించినా ఫ‌లితం లేద‌నే ఆవేద‌న‌.. వేలాది మంది విద్యార్థులు ఒకే మాట‌.. బాట‌గా సాగారు.. చివ‌ర‌కు అనుకున్న‌ది సాధించుకున్నారు. తెలంగాణ ఉద్య‌మం త‌ర్వాత పెద్దఎత్తున శాంతియుతంగా జ‌రిగిన ఓ ఉద్య‌మం విజ‌యం సాధించింది.

బాస‌ర ట్రిపుల్ ఐటీలో త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఏడు రోజులుగా పాటు కొన‌సాగిన విద్యార్థుల ఆందోళ‌న కొలిక్కి వ‌చ్చింది. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి హామీ ఇవ్వ‌డంతో తాము ఆందోళ‌న విర‌మిస్తున్న‌ట్లు విద్యార్థులు ప్ర‌క‌టించారు. సోమవారం రాత్రి విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇన్చార్జి వీసీ రాహుల్ బొజ్జా, కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషరఫ్అలీ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే రెండు గంటలపాటు చర్చించారు. బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

నెల రోజుల్లో ట్రిపుల్ ఐటీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ఇందుకు తనదే పూచీకత్తు అంటూ సమ స్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. తక్షణమే రూ. 5 కోట్ల చెక్కును మౌలిక వసతుల కోసం అందించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన మంత్రి సబితతో పాటు అధికారుల‌కు విద్యార్థులు ధన్యావాదాలు తెలిపారు. మంత్రి సబిత ఈ రాత్రికి ఇక్కడే క్యాంపస్‌లో బస చేసి రేపు ఉదయం త‌మ సమస్యలు తెలుసుకుని వెళ్లాల్సిందిగా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. అయితే నెల రోజులకు వచ్చి మీ అందరితో కలిసి భోజ‌నం చేసి వెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఏడు రోజులుగా చేపట్టిన సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్టు విద్యార్థులు ప్రకటించారు. మంగ‌ళ‌వారం నుంచి తాము త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతామ‌ని వెల్ల‌డించారు. విద్యాశాఖ మంత్రే తమవద్దకు వచ్చి హామీ ఇచ్చినందున తమకు నమ్మకముందని, తమ ఆందో ళన విరమించుకుంటున్నామని వారు ప్రకటించారు. మంత్రి రాక సంద‌ర్భంగా పోలీసులు భారీ బందోబ‌స్తు నిర్వ‌హించారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాత్రి 10 గంటల ప్రాంతంలో బాసర త్రిపుల్ ఐటి క్యాంపస్ వద్దకు చేరుకోగా.. పోలీసులు, భద్రతా బలగాల పెద్ద ఎత్తున మోహ‌రించాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like