కన్నీళ్లు తుడుచుకుని.. కష్టాలు దాటుకుని…

ఎన్నో కష్టాలు… కన్నీళ్లు దాటుకుని దేశంలోనే అత్యున్నత పదవికి పోటీ పడే స్థాయి వరకు ఇది ద్రౌపది ముర్ము జీవితం… దేశంలో వెనకబడిన రాష్ట్రల్లో ఒకటైన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో 1958 జూన్ 20న గిరిజన కుటుంబంలో జన్మించారామె.
ద్రౌపది ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి తక్కువేమీ కాదు. రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ.. ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం అత్యంత విషాదభరితం. అన్నీ తట్టుకొని నిలబిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్ తెగ. మారుమూల పల్లెటూర్లో, నిరుపేద కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్ము చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు అనుభవించారు.. మరెన్నో చేదు అనుభవాలు చవిచూశారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ముతో పాటు ఇద్దరు కుమారులను కూడా దేవుడు ఆమె నుంచి దూరం చేశాడు. అయినా ఏ మాత్రం కృంగిపోకుండా తన ప్రజా సేవ కొనసాగిస్తూ ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే వస్తున్నారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది ఎప్పుడూ ధైర్యం కొల్పోలేదు. తన కూతురును కొడుకుల్లాగే పెంచింది. ఆమెకు కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము.
కౌన్సిలర్ పదవి నుంచి..
చదువుకున్న వ్యక్తిగా తన గిరిజనం బాగు కోసం తపించే ద్రౌపది ముర్ము తొలిసారి బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒడిస్సాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును 2007లో అందుకున్నారు. 2004లో రెండోసారి ఎన్నికయ్యారు. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్రసృష్టిస్తారు.
చిన్న చిన్న విషయాలకే కుంగిపోయే ఎంతో మందికి నిజంగా ద్రౌపది ముర్ము జీవితం ఆదర్శప్రాయం.. మారుమూల గ్రామంలో పుట్టి, పరిస్థితులకు ఎదురీది.. ముందుకు సాగిన ఆమె త్వరలోనే దేశంలో అత్యున్నత పీఠం ఎక్కనున్నారు.