వెలుగులోకి వేణుగోపాలాచారి..
-ట్రిపుల్ ఐటీ వ్యవహారంలో ఐకేకి ఫెయిల్ మార్కులు
-జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దిన మాజీ కేంద్రమంత్రి
నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంలో విద్యార్థులు విజయం సాధించారు. తమ సమస్యలను పరిష్కరించాలని దాదాపు వారం రోజుల పాటు ఆందోళన నిర్వహించిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. అయితే ఈ ఆందోళన రాజకీయంగా కొందరిని ఇబ్బందిలోకి నెట్టగా, మరికొందరికి రాజకీయ పరంగా మేలు చేసింది.
రోజురోజుకి జఠిలమైన సమస్య..
తమ సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాసరలో వేలాదిమంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. మొదట దీన్ని లైట్‌గా తీసుకున్న ప్రభుత్వం, అధికారులకు అది సాధారణ సమస్య కాదని అర్ధమైంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా కలెక్టర్, ఇతర అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. అయితే విద్యార్థులు ఎవరూ కూడా వినలేదు. రెగ్యులర్ వీసీని నియమించాలని తదితర 12 డిమాండ్లతో ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం ఈ ఆందోళనకు మద్దతు చెప్పడమే కాకుండా కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలతో సహా చాలా మంది బాసరకు చేరుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేయడం ఆందోళన ఉధృతం అవడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
మంత్రి మాటలు నమ్మమని తేల్చేసిన విద్యార్థులు..
దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన విద్యార్థులతో చర్చలు జరిపారు. అయితే, విద్యార్థులు మంత్రి మాటలను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. గతంలో మీరు మూడు, నాలుగు సార్లు హామీలు ఇచ్చారని తర్వాత వాటిని పట్టించుకోలేదని తేల్చి చెప్పారు. మీ మాటపై మాకు నమ్మకం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెగేసిచెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆయన బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో చర్చలు సఫలమయ్యాయని విద్యార్థులు తరగతులకు హాజరవుతారని ప్రకటించారు. అందుకు విరుద్ధంగా విద్యార్థులు చర్ఛలు విఫలమయ్యాయని ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. వర్షం పడుతున్నా ఆపకుండా విద్యార్థులు దీక్షలు కొనసాగించారు. మంత్రితో పాటు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఉన్నారు. అయినా వీరెవరి ఆటలు కూడా విద్యార్థుల ముందు సాగలేదు. మరోవైపు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులవి సిల్లీ డిమాండ్లని మాట్లాడటంతో సమస్య మరింత జఠిలం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి ట్రబుల్ షూటర్‌ని రంగంలోకి దింపింది.
రంగంలోకి ట్రబుల్ షూటర్..
ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వేణుగోపాలాచారి అధికారులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులతో చర్చించారు. ఆ తర్వాత నేరుగా బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రిని తీసుకువచ్చి చర్చలు సఫలం చేయడంతో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ బాసరకు వచ్చి తమతో చర్చలు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లిఖితపూర్వక హామీ వస్తే తప్ప ఆందోళన నుంచి వెనక్కి తగ్గమని వెల్లడించారు. కానీ వేణుగోపాలాచారి రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇవేమీ లేకుండానే నిరసన విరమించారు. ఐఐఐటీ ఆందోళనను ముగించేలా ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన చారి తిరిగి తెరపైకి వచ్చారు. ఆయన ముథోల్ కానీ, నిర్మల్‌లో కానీ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు టిక్కెట్ రాని పక్షంలో బీజేపీలో సైతం చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చారి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన అంశాన్ని చాలా చాకచక్యంగా పరిష్కరించిన వేణుగోపాలచారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ముథోల్, నిర్మల్‌లో ఎవరి సీట్లకు ఎసరు తెస్తుందనేది మాత్రం కొద్ది రోజుల వరకు వేచి చూడాలి మరి..