గుడిలోనే బడి
ప్రభుత్వం విద్య కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోంది. కానీ అదంతా నిజం కాదని క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తెలిసిపోతోంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పాత సాంవ్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తరగతుల గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేది ఏమి లేక ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న శ్రీకృష్ణ మందిరంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అక్కడే తరగతులను నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాల పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడుతూ ట్వీట్ చేశారు. ఎలాంటి వసతులు లేని కుబీర్ మండలం పాత సాంవ్లీ పాఠశాల దుస్థితి తెలియజేసే వీడియోను పోస్ట్ చేశారు. ‘బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇది. ఇదేనా తెలంగాణ మోడల్? ’ అంటూ విమర్శించారు. ఇప్పటికైనా తమ బడికి గదులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.