అదే హోదాలో సర్ఫేస్ ఉద్యోగం ఇవ్వాలి
కుటుంబాలతో సహా మైనింగ్ ఉద్యోగుల పోరుదీక్ష
మెడికల్ ఆన్ ఫిట్ అయిన మైనింగ్ ఉద్యోగులను అదే హోదాలో సర్ఫేస్ లో ఉద్యోగం కల్పించాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రామగుండం ఏరియా వకిల్ పల్లిలో పనిచేస్తున్న సూపర్ వైజర్ ప్రసాద్ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయ్యారు. యాజమాన్యం ఆయనను జనరల్ మజ్దూర్‌గా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీ-2 జిఎం కార్యాలయం ఎదుట మైనింగ్ ఉద్యోగుల కుటుంబాలతో సహా పోరుదీక్ష చేపట్టారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్న మైనింగ్ సిబ్బందిని యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. మెడికల్ అన్ఫిట్ అయిన మైనింగ్ ఉద్యోగులను అదే హోదాలో సర్ఫేస్ లో ఉద్యోగం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మైనింగ్ స్టాఫ్ చేస్తున్న దీక్షకు 5 జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం మద్దతు తెలిపింది. ఇప్పటికైనా యాజమాన్యం పునరాలోచించి సమాన హోదా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గతంలో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కాకముందే యాజమాన్యం స్పందించాలని కోరారు.