కల సాకారానికి మరో అడుగు
-గోదావరి పై బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
-రూ. 108.52 కోట్లతో ఎస్టిమేషన్
-24 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధన
మంచిర్యాల : మంచిర్యాల,పెద్దపల్లి జిల్లా అంతర్గాం, సరిహద్దులో ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణంలో కదలిక వచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ టెండర్లు పిలిచింది. రూ. 108.52 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. 24 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధన విధించారు.
ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మిస్తామని 2018లో ఎలక్షన్లప్పుడు సీఎం కేసీఆర్ చెప్పారు. 2018లోనే బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.125 కోట్లతో డీపీఆర్ ఇచ్చారు. దానికి అనుమతులు వచ్చాయి. ఫండ్స్ కూడా రిలీజ్అయ్యాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంలో నిర్లక్ష్యం చేసింది. బ్రిడ్జి ఏర్పాటైతే రెండు జిల్లాలను కలుపుతూ నేషనల్ హైవేగా రోడ్డు సౌకర్యం మెరుగవుతుంది. పెద్దపల్లి, మంచిర్యాల నడుమ గోదావరిఖని మీదుగా 1984లోనే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ట్రాఫిక్ తాకిడి పెరిగిపోవడంతో రాజీవ్రహదారి నిర్మాణ క్రమంలో మరో బ్రిడ్జిని కూడా నిర్మించారు. హైదరాబాద్, కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా మంచిర్యాలకు గోదావరిఖని బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి. రామగుండం నుంచి గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు చేరుకోవడానికి 50 కిలోమీటర్ల దూరం, రెండు గంటల సమయం పడుతుంది. అదే అంతర్గాం దగ్గర గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కేవలం 2 కిలో మీటర్ల దూరంతో మంచిర్యాలకు చేరుకోవచ్చు. దీని ద్వారా సమయంతో పాటు దూరం కూడా తగ్గుతుంది. అలాగే గోదావరిఖనిలో ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను పొటెన్షియల్ ఏరియాలుగా చెప్తారు. దేశంలోనే పేరున్న ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు, సిమెంటు ఫ్యాక్టరీలు, ఇటీవల ప్రారంభమైన ఆర్ఎఫ్సీఎల్ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి పైనుంచి వేలాది వెహికల్స్ రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి మానవ రవాణా కంటే సరుకుల రవాణే ఎక్కువగా ఉంటుంది. ఒక బ్రిడ్జి ఉన్నా పెరిగిపోయిన రవాణాకు అనుగుణంగా మరో బ్రిడ్జి ఇక్కడ తప్పనిసరి. వరంగల్, భూపాలపల్లి నుంచి గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు వెళ్లాల్సిన వెహికల్స్కు పాత బ్రిడ్జి అనుకూలంగా ఉంటుంది.
హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్కు సమయం, దూరం కలిసి రావాలంటే అంతర్గాం, మంచిర్యాల బ్రిడ్జి నిర్మించాల్సిందే. అందుకే ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరుకుల రవాణా సులభమవుతుంది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు నిత్యం బొగ్గు, ఇసుక, సిమెంటు రవాణా జరుగుతుంది. ఈ బ్రిడ్జి కోసం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంఘాలు సర్కారుపై ఎప్పటి నుండో పోరాటం చేస్తూనే ఉన్నాయి.
ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవడటం తో రెండు జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.