ఈదులవాగుపై బ్రిడ్జి నిర్మిస్తాం
-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-వరద తీవ్రతపై అధికారులు దృష్టి సారించాలి
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : రాకపోకలకు అంతరాయంగా ఉన్న ఈదులవాగు బ్రిడ్జిపై త్వరలోనే బ్రిడ్జి నిర్మిస్తామని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. జైపూర్ నుండి పెగడపల్లి మధ్యలో ఉన్న ఈదులవాగు, చెన్నూర్‌లోని పెద్ద చెరువు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదుల వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని స్పష్టం చేశారు. ఈ వాగు జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పక్కనే ఉండడంతో సింగరేణి సీఎస్ఆర్ నిధుల నుండి రూ.3.20 కోట్ల నిధులు అందించాలని సింగరేణి సంస్థకు ప్రతిపాదనలు పంపించామన్నారు. R&B శాఖ ద్వారా ఈ ప్రతిపాదనలు పంపిన విషయం వెల్లడించారు. ఈ విషయంలో అక్కడే ఆయన సింగరేణి డైరెక్టర్ (పా) బలరాంతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని వెల్లడించింది. త్వరలోనే ఈదుల వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు హామీ ఇచ్చారు.