ఆదివాసులపై దాడులు ఆటవిక చర్య
కోయ పోశగూడ ఘటన పై ఎంపీ సోయం దిగ్భ్రాంతి..
దండేపల్లి మండలం కోయపోశగూడలో ఆదివాసీ మహిళలపై పోలీసులు, అటవీ సిబ్బంది తరచూ దాడులు చేయడాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం హైదరబాద్లోని బీజేపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నెల రోజుల కిందట కోయపోశగూడెంలో అటవీ భూములను సాగు చేస్తున్నారని 12 మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేశారన్నారు. ఫారెస్ట్ అధికారులు వారిని జైలుకు పంపించారని ఆ ఘటన మరువకముందే గుడిసెలను తొలగించారని అన్నారు. పోలీసులు, అటవీ సిబ్బంది అమానుషంగా వారిపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే చెప్పిన మాటలు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఆదివాసులపై తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములపై అటవీ అధికారుల నిర్బంధం సహించమని అన్నారు. మరోసారి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎంపీ రవీందర్ నాయక్, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.