జ్యోతిబాపూలే హాస్టల్ వద్ద ఉద్రిక్తత
స్టూడెంట్స్‌కు మద్దతుగా తల్లిదండ్రుల రాస్తారోకో

ఆదిలాబాద్ : జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలి ఆందోళన, రాస్తారోకో సైతం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ మహాత్మ జ్యోతిబా పూలే హాస్టల్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా తల్లిదండ్రులు సైతం రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులకు ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని, సరైన మౌలిక వసతులు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు దుయ్యబట్టారు. విద్యార్థులకు హాస్టల్లో సరైన వసతులు లేవని విద్యార్థులు విద్య ఎలా కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హాస్టల్లోని గదులలో నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.