21న విచారణకు రండి
సోనియాకు ఈడీ సమన్లు
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న విచారణకు రావాలని ఈడీ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని గతంలోనే సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆరోగ్య కారణాలతో తనకు నాలుగు వారాల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించిన విషయాన్ని సోనియాగాంధీ ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ నెల 22వ తేదీ వరకు సోనియాగాంధీకి ఇచ్చిన గడువు తీరనుంది. దీంతో ఈ నెల 21న విచారణకు రావాలని ఈడీ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేశారు.
సోనియా, రాహుల్ వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. రాహుల్ డైరెక్టర్గా ఉన్న యంగ్ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ తో సహా ఏజేఎల్ ఆస్తులను వైఐఎల్ సంస్థ రూ.2000 కోట్లపైగా ఆస్తులను అక్రమంగా తీసుకుందని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఏజేఎల్ కు బకాయిపడిన రూ.90.25 కోట్లకు వైఐఎల్ కేవలం రూ.50లక్షలను మాత్రమే చెల్లించిందని సుబ్రమణ్యస్వామి వాదన. ఈ కేసులో రాహుల్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు.