ఆదిలాబాద్ వరదలపై సీఎం స్పెషల్ ఫోకస్…
ఇంద్రకరణ్ రెడ్డికి ప్రత్యేక ఆర్డర్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం కేసిఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో, అప్రమత్తతతో వుండాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్దంగా వుండాలన్నారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ ఆరా తీసారు. వరద ముప్పు వున్న జిల్లాల అధికారులతో మాట్లాడి, పరిస్థితులను అంచనా వేశారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని.,గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎం తగు సూచనలు చేశారు. వరద పెరగడం ద్వారా రిజర్వాయర్లకు చేరే బ్యాక్ వాటర్ తో ముంపునకు గురికాకుండా చూసుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావుకు సిఎం సూచించారు.
వారం పది రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెల్లవద్దన్నారు. వరదల నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పాటు జిహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీములు సహా హెలికాప్టర్ లను సిద్దం చేసుకోవాలని సిఎం సిఎస్ ను ఆదేశించారు.
గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్ అదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్ధానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లకు సీఎం ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదిలేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం సూచించారు.