అధికారులు అందుబాటులో ఉండాలి
-ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావొద్దు
-వర్షంలోనూ ఎమ్మెల్యే నడిపెల్లి పర్యటన
మంచిర్యాల : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళవారం దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చెరువుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని అన్నారు. చెరువులు, కుంటలు పూర్తి జలకళను సంతరించుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని చెప్పారు. పాత ఇండ్లు, గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండ్లు కూలిపోయే దశలో ఉన్న వారి స్థానికంగా రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే దగ్గర్లోని పాఠశాలలో కానీ, ఏదైనా ప్రభుత్వ భవనాల్లో ఆశ్రయం కల్పిస్తారని తెలిపారు. ఆయన వెంట ఎంపీపీలు గడ్డం శ్రీనివాస్, మందపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీలు అనిల్, బేతు రమాదేవి, పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, బండారి మల్లేష్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.