సింగరేణి నిధులు ఇష్టమెచ్చినట్లు మళ్లిస్తున్నారు
-లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టారు
-రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు 24వేల కోట్లు వెంటనే చెల్లించాలి
-ఏఐటీయూసీ నేతల డిమాండ్
మంచిర్యాల : సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని ఏఐటీయూసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులను మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్లపై ఏఐటియుసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. మందమర్రి కేకే1 గనిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకుంటూ లాభాల్లో ఉన్న సింగరేణిని ముఖ్యమంత్రి, సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.3,500 కోట్ల లాభాల్లో ఉన్న సంస్థ ఇప్పుడు రూ.9,500 కోట్ల అప్పులకు చేరిందని మండిపడ్డారు.
వరద బాధితుల కోసం సింగరేణి నుంచి 1,000 కోట్లు నిధులు కేటాయించాలని చూడటం దారుణమని అన్నారు. ఇతర ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు, హరిత హారానికి, కరోనా వైరస్ నిర్మూలన కోసం, మెడికల్ కళాశాల కోసం, ఎమ్మెల్యే లకు సింగరేణి నుండి వందల కోట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. సింగరేణి కి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 24వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. సింగరేణి నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పిట్ సెక్రటరీ ప్రభాకర్, ఏఐటీయూసీ నేతలు సాంబయ్య, దినేష్, సతీష్, గడ్డం సంతోష్, రవితేజ, భీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు.