కొమురం భీమ్ వ‌ర్థంతికి రండి

-ప్రధానమంత్రి మోడీని కలిసిన ఎంపీ సోయంబాపురావ్
-ప్రధాన సమస్యలపై ప్రధానికి వినతి పత్రం

గిరిజ‌నుల ఆరాధ్య దైవం కొమురంభీమ్ వ‌ర్థంతికి రావాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావ్ కోరారు. అక్టోబర్ 10న ఆయ‌న వ‌ర్థంతి ఉంటుంద‌ని ఆ స‌మ‌యంలో రావాల‌ని సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం ఎంపీ సోయం బాపూరావు ప్ర‌ధాన‌మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రధాన సమస్యలను విన్నవించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను దశల వారీగా అభివృద్ధి చేయ‌డానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ పనులు ప్రారంభించాల‌న్నారు.

జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్ లో అన్ని వసతులు అనుకూలంగా ఉన్నందున ఎయిర్ పోర్టు నిర్మించాలని కోరారు. పత్తి పంట అధికంగా పండించే అదిలాబాద్ జిల్లాలో మెగాటెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులను దృష్టిలో పెట్టుకొని గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయం,ఆదిలాబాద్, కాగ‌జ్‌న‌గ‌ర్‌ల నుంచి కొత్త రైళ్లను ప్రారంభించాలని కోరారు. తెలంగాణలో దీర్ఘకాలంగా మగ్గుతున్న ఆదివాసులకు పోడు భూముల సమస్యను పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు. తాను చెప్పిన స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రి సానుకూలంగా స్పందించార‌ని ఎంపీ సోయం బాపూరావ్ వెల్ల‌డించారు. ఎంపీ వెంట బీజేవైఎం జిల్లా నాయకులు ఎంపీ తనయుడు సోయం వెంకటేష్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like