తాళం వేసి.. నిర్బంధించి..
తన కింద సిబ్బందితో పని చేయించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారిదే.. కానీ, వారు బయటకు వెళ్లకుండా, కనీసం భోజనం, ఇతర పనులకు సైతం వెళ్లకుండా కార్యాలయానికి తాళం వేసి మరీ పనిచేయించాడో అధికారి. వివరాల్లోకి వెళితే…
మంచిర్యాల జిల్లాలో ఈజీఎస్ పనుల రికార్డుల తనిఖీ కోసం బృందాలు వస్తాయనే సమాచారం అందింది. దీంతో బెల్లంపల్లి ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి రికార్డులు పూర్తి చేసే పని అప్పగించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే సిబ్బంది బయటకు వెళ్లకుండా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు బయటకు వెళ్లకుండా తాళం వేసి లోపలే ఉంచారు. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి. సిబ్బంది ఎక్కడికి వెళ్లేది లేదంటూ హుకుం జారీ చేశారు. ముఖ్యంగా అందులో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని సైతం బయటకు వెళ్లకుండా తాళం వేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కనీసం మధ్యాహ్న భోజనానికి, ఇతర అత్యవసర పనుల కోసం సైతం బయటకు వెళ్లకుండా లోపలే ఉంచేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బృందం వస్తోందని, ఇలా వేళాపాల లేకుండా బలవంతంగా నిర్బంధించి పనులు చేయించడం ఏమిటని పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ మేరకు బెల్లంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.