ఉద్యోగాల పేరిట దళారుల దందా…
గోదావరిఖనిలో ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల నిరసన ర్యాలీ
రామగుండం ఎరువుల కర్మాగారంలో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసి ఇటు ఉద్యోగాలు… అటు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు రోడ్డెక్కారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఇటీవల పునర్ నిర్మించబడిన ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ దళారులు అమాయకులను మోసం చేశారు. లక్షల్లో డబ్బులు తీసుకుని తమను ఇబ్బంది పెట్టడంతో బాధితులు ఈరోజు గోదావరిఖని పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన ర్యాలీ చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మోసం చేసి తమ జీవితాలతో ఆట ఆడుకుంటున్నారని, తిరిగి డబ్బులు ఇవ్వకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
అలాగే వందలాది మందిని ఉద్యోగాల పేరిట మోసం చేసిన దళారులను రోడ్డుకి ఇడ్చుతామని, తీసుకున్న డబ్బులు చెల్లించే వరకు ఊరుకునేది లేదని ఎరువుల కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు అంబటి నరేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం జరిగే అసెంబ్లీ వరకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.