మంత్రి, ఎమ్మెల్యే అనుచరులే వసూళ్ల రాయుళ్లు
ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు ఆరోపణలు
రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాల బాధితులకు న్యాయం చేయకపోతే రచ్చ,రచ్చ చేస్తామని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోనే ప్రకాష్ రావు మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు బాధితుల వద్ద నుంచి వసూళ్లు చేశారని ఆరోపించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులే ఈ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వారి సీడీలు బయటపెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్ద కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ సీసీ ఫుటేజీ లు ఉన్నాయని అరోపించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బావ అంతర్గాం జడ్పీటీసీ ఆముల.నారాయణ, జెన్కోకు చెందిన ఎకరం భూమిని కబ్జా చేశాడని దుయ్యబట్టారు. ఆ భూమిలో ఇటుకల ప్లాంట్ పెట్టాడని ఆరోపించారు. ఆ భూమి వెనక్కి తిరిగి ఇవ్వకపోతే ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. రామగుండం ఎరువుల కర్మాగారం బాధితులకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటిఆర్ వద్దకు బాధితులను తీసుకపోతాని స్పష్టం చేశారు. వారు కూడ న్యాయం చేయక ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే సమస్య పరిష్కారం కోసం గవర్నర్ వద్దకు కూడ వెళతానని పేర్కొన్నారు. రామగుండం ప్రజా ప్రతినిధులు బూడిద, ఇసుక, ప్రభుత్వ భూములు, చీకటి వ్యాపారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు.