నక్సల్స్ దాడులు తగ్గాయి : కేంద్రం వెల్లడి
వామపక్ష తీవ్రవాదం, నక్సల్ దాడులు తగ్గుముఖం పట్టాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో పలు విషయాలు వెల్లడించారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నలకు నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. 2014లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 70 ఉండగా, 2021 నాటికి ఆ సంఖ్య 46కి పడిపోయిందని మంత్రి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2014లో 1,091 కేసులు నమోదు కాగా 2021 నాటికి 509కి తగ్గాయని చెప్పారు.
2014-15 నుంచి 2021-22 వరకు కేంద్ర హోంశాఖ నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు పలు పథకాల కింద రూ.6,578 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సంబంధిత వ్యయం, ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం, ప్రత్యేక కేంద్ర సహాయ పథకం, రోడ్ కనెక్టివిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్, జవహర్ నవ విద్యాలయం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఆర్థిక సహాయం వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద 12,082 కి.మీ ఏర్పాటు చేశామని, ఇందుకోసం రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుకు రూ.11,780 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తెలిపారు. వీటిలో బీహార్‌లోని గయాలో 196 కి.మీ, ఔరంగాబాద్‌లో 237 కి.మీ సహా 6,274 కి.మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.