ఇదీ కాంగ్రెస్ పార్టీ నీతి..
రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని లోక్సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని దుయ్యబట్టారు. ‘ఆదివాసీ విరోధి కాంగ్రెస్.. మహిళా విరోధి కాంగ్రెస్.. గరీబ్ విరోధి కాంగ్రెస్.. ’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన ఓ పోస్టులో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ ధ్వజమెత్తింది. అధిర్ రంజాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని స్మృతి ఇరాని డిమాండ్ చేశారు. ‘‘సోనియా గాంధీ.. మీరు ద్రౌపది ముర్ము అవమానాన్ని ఆమోదించారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో మహిళను అవమానించడాన్ని సోనియా ఆమోదించారు’’ లోక్సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ.. ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను దురుద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఆమెను.. ‘‘తోలుబొమ్మ’’, ‘‘చెడుకు చిహ్నం’’ అని కామెంట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే విషయంలో లోక్సభలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా వారి పార్టీ నేత అలా మాట్లాడటానికి అనుమతించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. సోనియా గాంధీ దేశం ముందుకు వచ్చి రాష్ట్రపతిని అవమానించినందుకు క్షమాపణ చెప్పాల’ని నిర్మలా సీతారామన్ అన్నారు.
బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన అవమానం. సోనియా గాంధీ భారత రాష్ట్రపతికి, దేశానికి క్షమాపణ చెప్పాలి’’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.
అయితే ఈ విషయంలో ఆయన ఎప్పుడో క్షమాపణలు చెప్పారని సోనియా గాంధీ చెప్పగా, తాను పొరపాటుగా రాష్ట్రపత్ని అన్నానని క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. ఇప్పుడు మీరు దాని కోసం నన్ను ఉరితీయాలనుకుంటే.. మీరు ఆ పని చేయవచ్చు. అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా దీనిని పెద్దగా చేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి చౌదరి చెప్పారు.