తెప్పలపై వాగులు దాటి…
-గంగాపూర్ కు ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యాం నాయక్
-భారీ వర్షంలో సైతం పర్యటించిన ఎమ్మెల్యే

ప్రజలను కలుసుకోవాలని తపన.. సమస్యలు తీర్చాలనే ఆలోచన.. అంతే ఆ ఎమ్మెల్యే ఓ రకంగా సాహసం చేశారు. ప్రజలను కలుసుకునేందుకు వాగులు, వంకలు దాటారు.. చివరకు తెప్పలు, ఎండ్ల బండ్లపై భారీ వర్షంలోనూ ప్రయాణం చేసి గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారు.. వివరాల్లోకి వెళితే..
కడెం మండలంలోని మారుమూల ప్రాంతమైన గంగాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యాం నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు వ్యవసాయ భూములను పరిశీలించారు. వంతెన పనులు వరదల వల్ల నిలిచిపోయాయి. దీంతో ఆమె తెప్ప పై వాగు దాటి గ్రామానికి చేరుకున్నారు. గంగాపూర్ వంతెన రీడిజైన్ చేయించాలని పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థుల చాలా ఇబ్బందులు పడుతున్నారని పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి వస్తారని ఆమె తెలిపారు. సీఎం దృష్టికి ప్రజల సమస్యలను తీసుకొని వెళ్తామన్నారు. ముంపు ప్రాంతాలు స్వయంగా పరిశీలిస్తూ తిరిగారు.