నిర్మాణ పనులు అడ్డుకున్న సింగరేణి సెక్యూరిటీ

బెల్లంపల్లిలో సింగరేణి క్వార్టర్ వద్ద జరుగుతున్న నిర్మాణం పనులను ఆ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పీఎ బీమాగౌడ్ భార్య గడ్డం కళ్యాణి పేరిట ఈ క్వార్టర్ కేటాయించారు. కళ్యాణి బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చేస్తున్నారు. ఆమె భర్త బీమాగౌడ్ సింగరేణిలో జనరల్ మజ్దూర్ గా పని చేస్తున్నారు. బెల్లంపల్లి పట్టణం స్టేషన్ రోడ్డు కాలనీలో గడ్డం కళ్యాణికి బీ2 క్వార్టర్ కేటాయించారు. అయితే ఈ క్వార్టర్‌ను ఆధునీకరించేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం క్వార్టర్ లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయడానికి వీలు లేదు. ప్రతి రోజూ ఈ క్వార్టర్ ఆధునీకరణ పనులను ఎస్ అండ్ పీసీ సిబ్బంది అడ్డుకుంటూనే ఉన్నారు.
క్వార్టర్‌కు సంబంధించి నేరుగా జీఎం చింతల శ్రీనివాస్‌కు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ఈ పనులను అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ క్వార్టర్ ఆధునీకరణ పనులు చేయడంతో పలువురు రాజకీయ నాయకులు నిత్యం వచ్చిపోతుంటారని అది తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధునీకరణ పనులకు సంబంధించి సింగరేణి అధికారులపై రాజకీయపరంగా ఒత్తిడులు సైతం తెస్తున్నారు. దీంతో ఈ క్వార్టర్ వ్యవహారం సింగరేణి అధికారులకు తలనొప్పిగా మారింది.