కాంగ్రెస్ పార్టీ దేనికీ భయపడదు..
-త్వరలో సీఎల్పీ బృందం కాళేశ్వరం పర్యటన
-వరదల నష్టంపై వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి
-సీఎల్పీ నేత భటి విక్రమార్క

కాంగ్రెస్ ఎవరికి, దేనికి భయపడదని సీఎల్పీ నేత భటి విక్రమార్క అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడకుండా బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాను కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడానని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీని ఓడించే బలం కాంగ్రెస్ కే ఉందని చెప్పారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరద కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రజల కష్టాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఎనిమిదేళ్ల రాష్ట్ర ఆదాయం మొత్తం కాళేశ్వరానికే ఖర్చు చేశారని వరదకు మొత్తం అది మునిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు ఎవరైనా వెళతాం అంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సీఎల్పీ బృందంతో కలిసి కాళేశ్వరం వెళనున్నట్లు తెలిపారు. తమను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. వరదల వల్ల జరిగిన నష్టంపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వర్షకాల సమావేశాలు ఇంకా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.