వ‌డ్ల బ‌స్తాలు మోసిన చేతులు… స్వ‌ర్ణ‌ప‌త‌కాన్ని అందించాయి..

చిన్న‌ప్పుడే నాన్న చ‌నిపోయాడు.. అన్న‌తో క‌లిసి దిన‌స‌రి కూలీగా మారాడు. అమ్మ టైలరింగ్ పని చేస్తే కుట్లు అల్లికలు పని నేర్చుకున్నాడు. రూపాయి కూలీకి వడ్ల బస్తాలు సైతం మోశాడు. క్వింటాళ్ల‌కు క్వింటాళ్ల వ‌డ్ల బ‌స్తాలు మోసిన‌ చేతుల‌తోనే భార‌త మువ్వ‌న్నెల ప‌తాకం స‌గ‌ర్వంగా ఎరిగేలా చేశాడు. ఆ చేతుల‌తోనే భార‌తదేశానికి స్వ‌ర్ణ ప‌త‌కం అందించాడు… అత‌నే అచింత షెవులి..

అచింత షెవులి… ఊహ తెలిసే నాటికి తండ్రి చనిపోయాడు. పేద‌రికంతో మ‌గ్గుతున్న కుటుంబం మ‌రింత‌గా కుంగిపోయింది. తండ్రి దహన సంస్కారాలకు సైతం డ‌బ్బులు లేవు. ఇరుగుపొరుగు వాళ్లు కొంత సాయం చేస్తే ఆ కార్యక్రమం పూర్తి చేశారు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్య‌త అచింత అన్న అలోక్ పై బాధ్య‌త ప‌డింది. ఊళ్లో దినసరి కూలీగా మారాడు. అచింతసైతం అన్నతో కలిసి పనులకు వెళ్లేవాడు. అన్నా తమ్ముళ్లు కలిసి ఊళ్లో వడ్ల బస్తాలు మోసేందుకు వెళ్లేవారు. ఒక్క బస్తా మోస్తే ఒక రూపాయి. ఇలా కుటుంబం గ‌డిచేది.

వాస్త‌వానికి అచింత అన్న వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్నాడు. కానీ తండ్రి చ‌నిపోవ‌డంతో ఆయ‌న క‌ల నెర‌వేర‌లేదు. కానీ తమ్ముడికి వెయిట్ లిఫ్టింగ్ లో ఇంటిదగ్గరే శిక్షణ ఇచ్చాడు అలోక్. తమ్ముడు స్కూల్, మండల, జిల్లా స్థాయిలలో పతకాలు తీసుకువస్తుంటే ఇక్కడే ఆగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. కోల్‌క‌తాకు మకాం మార్చాడు. అక్క‌డ మంచి శిక్ష‌ణ‌తో 2014లో నేషనల్ ఛాంపియన్స్ లో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ యూత్ కేటగిరీలో పాల్గొన్న అచింత.. నాలుగో స్థానంలో నిలిచాడు. అతడి ప్రతిభను గుర్తించిన కోచ్ అస్టోమ్ దాస్.. అచింతను పూణెలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్ (ఏఎస్ఐ)కు తీసుకెళ్లాడు. ఏఎస్ఐలో రాటుదేలిన అచింత.. 2018లో ఆసియన్ యూత్ ఛాంపియన్షిప్స్ లో సిల్వర్ గెలిచాడు. ఇక 2019లో కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ తో పాటు 2021లో అతడు చరిత్ర సృష్టించాడు. గతేడాది జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలలో భాగంగా అతడు రజతం నెగ్గాడు. పతకాల వేట ప్రారంభమయ్యాక అచింత వెనుదిరిగి చూసుకోలేదు..

కామన్వెల్త్ క్రీడలలో భారత మువ్వన్నెల పతాకాన్ని మరోసారి సగర్వంగా రెపరెపలాడించిన షెవులి.. 73 కిలోల విభాగంలో పోటీ పడ్డ అతడు.. ఏకంగా 313 కిలోల బరువును ఎత్తాడు. ఒక చిన్న గ్రామం నుంచి వ‌చ్చి భార‌త కీర్తిని ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌చేసిన షెవులి జీవితం అంద‌రికీ ఆద‌ర్శం కావాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like