కిడ్నాప్ కలకలం
ఛేజింగ్ చేసి పట్టుకున్న ఎస్ఐ సతీష్
ఓ వివాహితను తల్లిదండ్రులే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన జన్నారం మండలంలో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఛేజ్ చేసి మరీ యువతిని రక్షించారు. వివరాల్లోకి వెళితే… జన్నారం మండలం మొర్రిగూడకు చెందిన దళిత యువకుడు తోట నాగేష్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామకు చెందిన అమ్మాయి లక్ష్మిని ప్రేమించి శనివారం పెండ్లి చేసుకున్నాడు. అయితే, ఈ వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో అబ్బాయి బంధువులపై వారం రోజుల కిందట దాడి చేసి కిడ్నాప్‌కు ప్రయత్నించారు. విషయం పోలీసులకు చేరడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చారు.
అమ్మాయి ఇష్టపడి పెండ్లి చేసుకుందని అమ్మాయిని తీసుకువెళ్లడానికి ప్రయత్నించినా, ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకుంటామని పోలీసులు, గ్రామ పెద్దలు హెచ్చరించడంతో అమ్మాయి తరఫు వాళ్లు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తిరిగి యువతి తల్లిదండ్రులు, బంధువులు ఐదు వాహనాల్లో వచ్చి తోట నాగేష్ ఇంటిపై దాడికి దిగారు. అమ్మాయిని కిడ్నాప్ చేసి వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లారు.
గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎస్సై సతీష్ లక్ష్మిని కిడ్నాప్ చేసిన వాహనాలను వెంబడించారు. వారిని దండేపల్లి మండలం ముత్యంపేట వద్ద పట్టుకున్నారు. మూడు వాహనాలు, 17 మంది నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.