ఎమ్మెల్యే ఇంటి ముందు వరద బాధితుల ఆందోళన
భారీ వర్షాల కారణంగా వరద ముంపు గురైన బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఆందోళన బాట పట్టారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన తమను ఎమ్మెల్యే దివాకర్ రావు తో పాటు ప్రభుత్వం ఆదుకోవడం లేదని ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. మళ్ళీ వర్షాలు కురుస్తుండడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసుకుని వెళ్లినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందక పోవడం దారుణమని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. సీఐ నారాయణ ఆధ్వర్యంలో ఆందోళన విరమింపచేశారు. ఎమ్మెల్యే నుండి ఎలాంటి స్పందన లేకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రం చేస్తామని వరద బాధితులు హెచ్చరించారు.