మంత్రి కృషి వల్లనే మెడికల్ కాలేజ్
మంత్రిని సన్మానించిన వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం
మంత్రి కృషి వల్లనే నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైందని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్ స్పష్టం చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో జాప్యం జరిందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఎట్టకేలకు కళాశాల మంజూరు చేయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
నిర్మల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. అనేక మందికి స్థానికంగానే పదోన్నతులు కూడా లభిస్తాయని తెలిపారు. కళాశాల మంజూరుకు మంత్రి ఎంతో కృషి చేసి విజయం సాధించారని కొనియాడారు. మంత్రి అల్లోల మాట్లాడుతూ నిర్మల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం 166 కోట్ల రూపాయలు మంజూరు అవుతున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయగా వెంటనే జీవో జారీ చేయడం అభినందనీయమన్నారు.
మెడికల్ కాలేజ్ విషయంలో ప్రతిపక్షాలు పనిగట్టుకొని పనికిరాని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తూ జీవో విడుదలైందని త్వరలోనే కళాశాల నిర్మాణం పనులు కూడా మొదలు పెడతామని చెప్పారు. ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అల్లోల మురళీధర్ రెడ్డి, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ డి.రాజేందర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మారుకొండ రాము, 3194 సంఘం జిల్లా కార్యదర్శి కన్నయ్య, కోశాధికారి వేణుగోపాలరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి ఉపాధ్యక్షులు బోజారెడ్డి, మతిన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఐజే లత, నాయకులు సురేష్ రెడ్డి, మాధురి, వరలక్ష్మి, ఉమారాణి, రవి తదితరులు పాల్గొన్నారు.