గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల సీజ్
గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను బెల్లంపల్లి ఎస్‌బీఐ అధికారులు సీజ్ చేయడం కలకలం సృష్టించింది. బెల్లంపల్లి మండలంలోని ఏడు ట్రాక్టర్లు మూడు నెలలుగా ఈఎంఐ చెల్లించడం లేదు. దీంతో ఆ ఏడింటిని స్టేట్ బ్యాంకు సిబ్బంది సీజ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి నెల ట్రాక్టర్లకు సంబంధించి రూ. 15 వేల చెక్కును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఆ చెక్‌లకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదు. మూడు నెలలకు ఓసారి బ్యాంకు అధికారులు వాటిని క్లెయిం చేస్తుంటారు. ఈ ట్రాక్టర్లకు సంబంధించి చెక్‌లు క్లెయిం కాకపోవడంతో ఏడు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, ట్రాలీ ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్రాక్టర్లు కొనుగోలు చేసింది. చెత్తను తొలగించడం, హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయడం, ఇతర పంచాయతీ అవసరాలకోసం ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. వాస్తవానికి ట్రాక్టర్ల వినియోగంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చకచకా నడుస్తున్నాయి. ఇక వాటి ద్వారా చెట్లకు నీళ్లు పోసే కార్యక్రమం కూడా విజయవంతంగా సాగుతోంది.
అయితే, వీటికి నిధులు సమకూర్చడంలో విఫలం అవటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేందుకు నిధులు లేవా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మూడు నెలల పాటు అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.