ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి
-సిబ్బంది నిర్లక్ష్యమే అని బంధువుల ఆరోపణ
-సీరియస్‌గా ఉంది.. కరీంనగర్ తీసుకువెళ్లమంటే వెళ్లలేదని ఆసుపత్రి వర్గాల వెల్లడి

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. ఈ విషయంలో ఆసుపత్రి సిబ్బంది నిరక్ష్యంగా వ్యవహరించారని అందుకే చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ బాబు పరిస్థితి మొదటి నుంచి సీరియస్‌గానే ఉందని కరీంనగర్ తీసుకువెళ్లమంటే తీసుకువెళ్లలేదని అందుకే ఆ బాబు చనిపోయాడని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం నీలాయపల్లికి చెందిన బుచ్చక్క, శేఖర్ దంపతులకు మంగళవారం ఉదయం నాలుగున్నర ప్రాంతంలో మంచిర్యాల ఆసుపత్రిలో బాబు పుట్టాడు. అయితే, ఉమ్మనీరు సరిగ్గా లేకపోవడంతో పాటు బాబు తలవాపుతో అనారోగ్యంగా జన్మించాడు. దీంతో ఈ రోజు తెల్లవారుఝామున వైద్య సిబ్బంది బాబు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకువెళ్లాలని సూచించారు. బంధువులు పట్టించుకోలేదని సిబ్బంది చెబుతున్నరు.
అయితే, ఈ విషయంలో ఆ బాబు బంధువులు మరోలా చెబుతున్నారు. వైద్య సిబ్బంది బాబు ఆరోగ్య పరిస్థితి బాలేదని తమకు చెప్పలేదని మీడియా ముందు రోదిస్తూ వెల్లడించారు. తమను అటూ, ఇటూ తిప్పించారు తప్ప తమకు ఎలాంటి విషయాలు చెప్పలేదని చెప్పారు. బాబు మృతికి వైద్యసిబ్బందే కారణమంటూ బాబు తండ్రి శేఖర్ ఆరోపించారు.