నాకు ఫోన్ చేయండి…
సామాన్య పౌరుడికి తన ఫోన్ నంబర్ ఇచ్చిన అమిత్ షా
మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా గురువారం పాక్ సరిహద్దుకు సమీపంలోని మక్వాల్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో ముచ్చటించారు. అంతే కాదు.. తన మొబైల్ నంబర్‌ను ఒక సాధారణ పౌరుడికి ఇచ్చి.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి అండగా నిలుస్తామంటూ భరోసానిచ్చారు. ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదని.. సాధారణ ప్రజల భద్రతే తమ లక్ష్యమంటూ అమిత్ షా పేర్కొన్నారు. సైనికులతో కూడా ప్రత్యేకంగా ముచ్చటించారు. ఎలాంటి ఆందోళన లేకుండా.. దేశానికి సేవ చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భద్రతా సిబ్బందిని అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. అమిత్ షా మక్వాల్ నివాసితులతో ప్రత్యేకంగా సంభాషించారు. గ్రామంలోని ఇళ్లను పరిశీలించి.. మంచం మీద కూర్చుని నివాసితులతో మాట్లాడారు. ఈ సమయంలో గ్రామస్థులతో షా ముచ్చటిస్తుండగా.. గ్రామస్థుడు తనకు సమస్యలను వివరించబోయారు.. ఈ క్రమంలో అతనికి తన మొబైల్ నంబర్ ఇచ్చి.. మీరు నాకు ఫోన్ చేయండి అంటూ చెప్పారు.