అదానీ చేతికి NDTV గ్రూప్..

Adani media group to buy 29.2% stake in NDTV:వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ఎన్డీటీవీని కొనుగోలు చేసింది. మీడియా గ్రూప్ ఎన్డిటివిలో(NDTV) 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ మీడియా ప్రకటన వెల్లడించింది.
ఈ కొనుగోలు వివరాలను మీడియా ఇనిషియేటివ్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ CEO, ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ పుగాలియా వెల్లడించారు. AMG మీడియా నెట్వర్క్ లిమిటెడ్ (AMNL)కి చెందిన అనుబంధ సంస్థ అయిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ద్వారా పరోక్షంగా 29.18 శాతం వాటా కొనుగోలు చేశారు. ఈ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) యాజమాన్యంలో ఉంది. ఇదిలా ఉంటే బీఎస్ఈలో ఎన్డీటీవీ యాజమాన్యం ఒక స్టేట్మెంట్ ప్రకటన చేసింది. ఎన్డీటీవీలో వాటాల ఉపసంహరణ, యాజమాన్య హక్కుల బదిలీపై రాధిక గానీ, ప్రణయ్ రాయ్ గానీ ఎటువంటి చర్చల్లో పాల్గొనడం లేదని తెలిపింది. వాటాదారుల ప్రయోజనాల కోసం ఈ వివరణ ఇస్తున్నట్లు వివరించింది.
NDTV అనేది మూడు దశాబ్దాలుగా విశ్వసనీయమైన వార్తలను అందించడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థ. కంపెనీ మూడు జాతీయ వార్తా ఛానెల్‌లను నిర్వహిస్తోంది. ఇందులో NDTV 24×7, NDTV ఇండియా, NDTV ప్రాఫిట్ ఉన్నాయి. ఈ ఛానెల్ బలమైన ఆన్లైన్ వ్యవస్థతో ఉంది. వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో 35 మిలియన్లకు పైగా వ్యక్తులతో సోషల్ మీడియాలో అత్యధికంగా అనుసరించే వార్తల ప్రసారమాధ్యమంగా ఇది నిలుస్తోంది.