ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు
నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

MLA distributed new pension cards: తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమం, రాష్ట్రఅభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్పష్టం చేశారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 300 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వడమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎంతటి ఆర్థిక భారమైనా భరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందన్నారు. పార్టీలకు అతీతంగా పారదర్శక పరిపాలన కొనసాగిస్తున్నారని, ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ దని ఎమ్మెల్యే దివాకర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 లక్షల మంది వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కమిషనర్,పట్టణ కౌన్సిలర్లు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.