ఉన్నతాధికారుల తిట్లు.. పోలీసుల పాట్లు..
-మావోయిస్టుల ప్రవేశానికి నిఘా వైఫల్యమే కారణం..?
-రిక్రూట్‌మెంట్ ప్రారంభించిన అన్నలు..?
-అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు
The ongoing police hunt for Maoists: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించిన విషయాన్ని నిఘా వర్గాలు పసిగట్టడంలో విఫలం చెందాయా..? హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు చెప్పే వరకు వారు ఆ విషయాన్ని గ్రహించలేదా..? స్థానికంగా ఉండే నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్లు..? అన్నలు లేరు, రారు అనే అతి విశ్వాసమే వారు ఇక్కడకు సులభంగా వచ్చేందుకు మార్గం సుగమమం అయ్యిందా..? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు…
దాదాపు రెండేళ్ల పాటు మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి అలికిడి లేదు. మావోయిస్టులపై నిర్భంధం, ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో అన్నలు అడవి విడిచి ఛత్తీస్‌ఘడ్, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక ఇటు వైపు అడుగుపెట్టాలంటేనే భయపడతారు. ఇది ఇప్పటి వరకు పోలీసుల భావన. కానీ, వాళ్ల ఆలోచనలు తప్పని నిరుపించారు మావోయిస్టులు. తాము వస్తామని, రిక్రూట్‌మెంట్ చేస్తామని, సానుభూతి పరులను కలుస్తామని పోలీసులకు సవాల్ విసిరారు. కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరిస్తూ మాజీలను కలుస్తున్నారని, రిక్రూట్‌మెంట్లు సైతం చేస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అడవులను జల్లెడ పడుతున్నారు.
మొదట్లో గుర్తించడంలో నిఘా వైఫల్యం..
అయితే జిల్లాలోకి అన్నలు వచ్చి చాలా రోజులు అవుతున్నట్లు సమాచారం. ఇక్కడ నిఘా వర్గాలు ఆ విషయాన్ని గుర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. దాదాపు పది నుంచి పదిహేను మంది వరకు మావోయిస్టులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. వారు ప్రాణహిత తీరం దాటి బెజ్జూరు ద్వారా తిర్యాణి అడవులకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఏడు యాక్షన్ టీంలు రంగంలోకి దిగినట్లు నిఘా వర్గాలు గ్రహించాయి. ఉన్నతాధికారులు హెచ్చరించినా స్థానిక పోలీసులు కొట్టిపారేసినట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిరోజులకు మావోయిస్టులు వచ్చారనే విషయం రూఢీ కావడంతో ఉన్నతాధికారులు జిల్లా పోలీసులకు క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకు అప్రమత్తంగా లేరు..
రెండేళ్ల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు రారనే ధీమాతో పోలీసులు ఉన్నారు. గతంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. చీమ చిటుక్కుమన్నా ఉన్నతాధికారులకు క్షణాల్లో సమాచారం తెలిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని భావిస్తున్నారు. పాత వారంతా బదిలీలపై వెళ్లడం, ఉన్నవారు కొత్త వారు కావడంతో సమాచారం తెలియడం ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. విషయం తెలియగానే మూడు జిల్లాల పోలీస్ బాస్‌లు అలర్టయ్యారు. మావోయిస్టుల ప్రవేశంపై ఏకంగా మూడు జిల్లాల పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మావోయిస్టుల సంచారం ఉంది…ఎవ్వరు సహకరించవద్దని స్పష్టం చేశారు. ఇక్కడకు వచ్చిన మావోయిస్టులు, వాళ్లపై ఉన్న రివార్డులకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.. ఇక కొమురం బీం జిల్లా ఎస్పీ అయితే బలగాలతో తిర్యాణి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆదివాసీలతో సమావేశమై ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసి మరీ వచ్చారు.
అన్నలు పని మొదలుపెట్టారు..?
పోలీసులకు విషయం కాస్తా తెలిసే సరికి అన్నలు గ్రామాల్లోకి ప్రవేశించి పని మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వారు ముఖ్యంగా రిక్రూట్‌మెంట్ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. మావోయిస్టు సానుభూతిపరులు, ఇతర వర్గాలను రిక్రూట్ చేసే పనిలో పడ్డారు. వచ్చిన మావోయిస్టులు చేతుల్లో ఆయుధాలు లేకుండా సాధారణ వ్యక్తుల్లా జనంతో కలిసిపోయినట్లు ఉన్నారనే సమాచారం పోలీసులకు చేరింది. అంతేకాకుండా, కాంట్రాక్టర్లు, ఇంకా కొంత మంది వద్ద మావోయిస్టు పార్టీకి ఫండ్ సేకరించే పనిలో ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు ఈ విషయంలో సక్సెస్ కాకుండా ఉండేందుకు పోలీసులు తమదైన కౌంటర్ టీంలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.