అధికార పార్టీ నేతల మట్టి దందా
-పేరు ప్రజలది.. సొమ్ము నేతలది..
-ఓపెన్‌కాస్టు మట్టి అమ్ముకుంటున్న టీఆర్ఎస్ నేతలు
-నిత్యం రూ. లక్షల్లో దందా
Ruling party leaders’ mud danda: ప్రజా సంక్షేమం పేరుతో అధికార పార్టీ నేతలు దందా చేస్తున్నారు. ఏకంగా సింగరేణినే మోసం చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలతో పాటు సింగరేణి కింది స్థాయి సిబ్బంది, ఎస్ అండ్‌పీసీ సిబ్బంది సైతం పాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాదేదీ దందాకు అనర్హం అన్నట్లుగా ఉంది మంచిర్యాల టీఆర్ఎస్ లీడర్ల పరిస్థితి. అధికారం ఉంటే చాలు ఏమైనా చేయచ్చు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు వారు. తమకు ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. అక్రమ మార్గాల్లో దందాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ అండ, మరోవైపు సింగరేణి అధికారుల ఉదాసీనతతో అక్రమ సంపాదనలో చెలరేగిపోతున్నారు. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి అధికారులు, ఎస్అండ్ పీసీ సిబ్బంది సైతం ఇందులో పాత్రధారులుగా ఉన్నట్లు సమాచారం.
సింగరేణి ఓపెన్‌కాస్టులో మట్టిని ఓవర్‌బర్డెన్‌గా వ్యవహరిస్తారు. వాస్తవానికి దీనిని కుప్పలుగా పోస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ పనులకు ఈ మట్టిని ఉచితంగా ఇస్తుంది. కలెక్టర్, ఎమ్మెల్యే కోరితే ఆ మట్టిని అందచేస్తారు. ఎక్కడైనా రోడ్లు పాడైపోతే, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన భవనాల్లో మట్టి నింపేందుకు ఇలా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ మట్టిని సరఫరా చేస్తారు. అంతేకాకుండా, సింగరేణి నిర్వాసిత గ్రామాల్లో సైతం ఏవైనా పనులు చేస్తే ఆ మట్టి వాడుకుంటారు. అయితే, దీనిని అడ్డుగా పెట్టుకుని కొందరు నేతలు అక్రమ దందాకు తెర తీశారు.
మంచిర్యాల పట్టణంలో నిత్యం నిర్మాణాలు కొనసాగుతుంటాయి. ముఖ్యంగా భవన నిర్మాణ పనులు కొనసాగుతుంటాయి. గోదావరి రోడ్ వైపు కొందరు బిల్డర్లు టీఆర్ఎస్ నేతలతో మాట్లాడుకుని సింగరేణి ఓపెన్‌కాస్టుకు సంబంధించిన ఈ మట్టిని తరలిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ మట్టిని అమ్మేసుకుంటున్నారు. ఓపెన్ కాస్టు టిప్పర్ల ద్వారా ఈ మట్టిని ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. ఆ తరువాత ట్రాక్టర్లు, లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 2,500 నుంచి, 3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక లారీలకు రూ. 8,000 నుంచి రూ. 9,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఇలా నిత్యం పదుల సంఖ్యలో లారీల ద్వారా ఈ మట్టి సరఫరా జరుగుతోంది. వాస్తవానికి మట్టి ఎటు వెళ్తోంది…? ఎవరు తీసుకువెళ్తున్నారు..? అనే విషయాలు అన్ని సింగరేణికి సంబంధించిన ఎస్అండ్‌పీసీ సిబ్బంది పరిశీలించాలి. కానీ, వారు సైతం అక్రమార్కులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ దందా ఎన్నో ఏండ్లుగా కొనసాగుతోంది. అయినా దీని వైపు కన్నెత్తి చూసే నాథుడే లేకుండా పోయాడు. నేతలు మాత్రం లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఈ విషయంలో శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి నాందిన్యూస్‌తో మాట్లాడుతూ మట్టి పక్కదారి పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ దందా ఆపివేయిస్తామని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రభుత్వ పనులకు, కలెక్టర్, ఎమ్మెల్యే లాంటి వారు ప్రజలకు అవసరమైన పనులకు చెబితే ఓపెన్‌కాస్టు మట్టిని పంపిస్తామని వెల్లడించారు. మట్టి పక్కదారి పడుతున్న వ్యవహారం తనకు తెలిసిందని దానిని ఆపుతామని మరోమారు స్పష్టం చేశారు.