కస్తూర్బా హాస్టల్‌లో విద్యార్థిని మృతి

Student dies in Kasturba hostel: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అనారోగ్యంతో హాస్టల్ విద్యార్థిని మృతి చెందింది. కాగజ్ నగర్ కస్తూర్బా పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఐశ్వర్య రెండు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడుతోంది. మంగళవారం రాత్రి సైతం తలనొప్పితో బాధపడిన ఐశ్వర్యకు తోటి విద్యార్థులు జండూబామ్ రాసి పడుకోబెట్టారు. రాత్రి బాత్రూమ్ సైతం వెళ్లి వచ్చిన ఐశ్వర్యకు తెల్లవారి ఎంతకూ లేవకపోవడంతో హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో తనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐశ్వర్యది కాగజ్‌నగర్ మండలం అంకుషాపూర్. కాగా, ఆమె మృతికి కారణం సిబ్బంది నిర్లక్ష్యమేనని విద్యార్థిని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నాయి.
పిల్లలను అన్ని రకాలుగా కష్టపెడుతున్నారు..
ఇక్కడ చదువుకునే పిల్లలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లి మధు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. పని చేసే సిబ్బంది ఎవరూ లేరని విద్యార్థినులతోనే పనులు చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లే నీళ్లు తీసుకువస్తారని, వాళ్లే ఊడ్చుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన తిండి పెట్టడం లేదన్నారు. టీచర్లు మాత్రం ప్రత్యేకంగా వంట చేయించుకుని తీసుకువెళ్తారని ఆరోపించారు. హాస్టల్ కు సంతోషంగా వచ్చే పిల్లలు ఇప్పుడు ఇక్కడకు రావాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని అన్నారు.