పాము కాటుతో అన్నాచెల్లెళ్ల మృతి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో విషాదం
Brother and her sisters died due to snake bite: ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నా చెల్లెళ్లను పాము కాటువేయడంతో ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుతిగూడలో జరిగింది ఈ సంఘటన. మారుతిగూడకు చెందిన కవితాబాయికి కుమురం భీం జిల్లా కెరమెరి మండలం అక్షయ పూర్ కు చెందిన ఆత్రం రాజుతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. భర్తతో గొడవల కారణంగా రెండేళ్లుగా తన ఏడుగురు పిల్లలతో పుట్టింట్లోనే ఉంటూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కవితాబాయి తన పిల్లలతో శనివారం రాత్రి గుడిసెలో నిద్రిస్తుండగా.. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన పాము భీంరావు (13), దీప (4)ను కాటు వేసింది. దీంతో పిల్లలు ఒక్కసారిగా కేకలు వేయడంతో కవిత బాయి మేల్కొంది. వెంటనే ఈ విషయాన్ని కవితాబాయి చుట్టుపక్కల వారికి తెలపడంతో.. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వాహనం వచ్చి.. వారిని ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే అన్నాచెల్లెళ్లు ప్రాణాలు వదిలారు. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.