సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు
-రోడ్డు కోతకు గురికావడంతో ప్రజలకు ఇబ్బందులు
-రవాణా కష్టాలు తొలగించేలా జేసీబీ, ట్రాక్టర్లతో పనులు
-రెండు రోజుల పాటు పనులు చేయిస్తామన్న మూల రాజిరెడ్డి
Road repairs with own funds: రెండు రోజుల కిందట రోడ్డు కోతకు గురైంది. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానిని కనీసం పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు కొంత మేరకు ప్రయత్నించినా విఫలమై వదిలేశారు. ప్రజలకు రవాణా పరంగా ఇబ్బంది అవుతోందని గమనించిన నేత ఒకరు సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులు చేయించారు. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి సమీపంలో అప్రోచ్ రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్ పట్టణ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బతుకమ్మ వాగు దగ్గర ఈ రోడ్డు కుంగింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా గుంత ఏర్పడింది. చింతలపల్లి వద్ద ఈ ఘటన జరగడంతో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కాళేశ్వరం, సిర్‌వంచ వెళ్లే ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
దీనిని గమనించిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులు చేయించారు. లింక్ రోడ్డు హైవే రోడ్డు నుంచి జడ్పీ రోడ్డుకు వెళ్లాంలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్లు నిలిచి పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి. ఆ రోడ్డు దగ్గర జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో పొదలు తీసివేయించారు. మొరంతో గుంతలు నింపారు. ఇక రోడ్డును పూర్తి స్థాయిలో చదును చేయించి రవాణాకు అనుగుణంగా మార్చారు. దీంతో రేపటి నుంచి బస్సు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలు కలిగింది. అక్కెపల్లి లో లెవల్ కాజ్‌వే దగ్గర మొరం పోయించారు. కాజ్‌వే మీద ఉన్న గుంతలు సైతం పూడ్చి వేశారు. రోడ్డుపై ఉన్న గుంతలను సైతం చదును చేయించారు.
అధికారులు ఈ విషయంలో కనీసం పట్టించుకోకపోవడం దారుణమని, కేవలం ఒక హోంగార్డు బండలను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు ప్రయాస పడుతున్నారని అది చూసి తనకు చాలా బాధ కలిగిందని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే తాను ట్రాక్టర్లు, జేసీబీ సాయంతో రోడ్డు మరమ్మతు చేయిస్తున్నట్లు వెల్లడించారు. మంగళ, బుధ వారాల్లో ప్రజలకు రవాణా పూర్తి స్థాయిలో మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరం అయితే గురువారం కూడా పనులు చేయిస్తామని వెల్లడించారు.