భైంసాలో ఎన్ఐఏ సోదాలు
searches by nia officials in bhainsa: నిర్మల్ జిల్లా భైంసాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఆదివారం ఉదయం 3 గంటల నుండి 6.30 వరకు కొనసాగాయి. భైంసా లోని మదీనా కాలనీ లో ఓ ఇంట్లో ఎన్ఐఏ బృందం సోదాలు చేసి వెళ్ళింది. ఈ సోదాలు రెండు రాష్ట్రాల్లో 25 బృందాలు కొనసాగిస్తున్నాయి.
నిజామాబాద్ పట్టణం ఆటోనగర్ లో నివాసం ఉంటున్న ఖాదర్ అనే వ్యక్తి వివాదాస్పదమైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ ఐ సంస్థ పేరు తో శిక్షణ నడిపించాడు. బయట కరాటే శిక్షణ పేరుతో మతపరమైన దాడులకు పాల్పడేలా శిక్షణ ఇచ్చాడు. దీంతో ఖాదర్ ఇంట్లో ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఆ ఇంటిపై దాడి చేసి ట్రైనింగ్ ను భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాదు, నెల్లూరు, కర్నూలు, కడప, భైంసా, మెటపల్లి ప్రాంతాలకు చెందిన యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆ ఇంట్లో మారణాయుధాలు, నిషేధిత సాహిత్యం, పిఎఫ్ఐ బ్యానర్లు, అనేక బస్సు, రైలు టికెట్లు, భారత దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సాహిత్యం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి? భౌతిక దాడులు ఎలా చేయాలి? అనేక అంశాలను నేర్పిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే భైంసాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుసుతోంది. ఈ ఘటనలో ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా..? లేదా అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో సైతం ఈ సోదాలు సాగుతున్నాయి. నంద్యాల, మెట్పల్లి తో పాటు పలు చోట్ల 25 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి.