స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న నాటుపడవ బోల్తా
The boat carrying the students capsized: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవాగులో ప్రమాదవశాత్తూ నాటుపడవ బోల్తా పడింది. నలుగురు స్కూల్ విద్యార్థులు, ఇద్దరు కూలీలతో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా ఒక వైపుకు ఒరగడంతో అందులో ప్రయాణిస్తున్న విద్యార్థుల బ్యాగులు, కూలీల సెల్ ఫోన్లు వాగులో పడిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అందవెల్లి పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు కుంగిపోవడంతో అధికారులు ఆ బ్రిడ్జి మార్గాన్ని మూసివేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదం అని తెలిసినా నిత్యం ఇలా నాటుపడవలలో ప్రయాణం చేస్తున్నారు అక్కడి ప్రజలు, విద్యార్థులు. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులలో మాత్రం చలనం లేకుండా పోతుంది. ఇకనైనా సమస్యను పరిష్కరించాలని, ఈ పడవ ప్రయాణాలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.